కాఫీవిత్ …’ఆర్ రమాదేవి’ .2809.
*కాస్త తప్పుకోవోయ్ !నా దారిన నన్ను వెళ్ళనివ్వు,
విసుగు ద్వేషం నేర్పించే కొత్త ‘ప్రేమపాఠం’ నేర్చుకోనివ్వు....”!!
ఒక్కోసారి మనసు అదుపు తప్పుతుంది..చికాకేస్తుంది. విసుగు కలుగుతుంది.
అకారణంగా ద్వేషమూ కలుగుతుంది..అసలు మనం మనమేనా?
ఇలా ఎందుకు జరుగుతుంది? అసలేమౌతోంది.? అస్సలు అర్ధంకాదు..
ప్రస్తుతం ఈ కవయిత్రి ఆర్. రమాదేవి పరిస్థితి ఇంచుమించు ఇలానే వుంది..
ఈ రోజు ‘ కాఫీ టైమ్లో ‘ రమాదేవి రాసిన కవిత ద్వారా అసలేం జరుగుతోందో చూద్దాం..
మీరు..కూడా ఓ సారి ఈ కవిత చదవండి..!!
“ఎందుకో ఒక్కసారిగా విసుగు వస్తుంది
కాదు... మరేదో కారణం లేని ద్వేషం వస్తుంది...
వార్డురోబ్ ఒక్కసారిగా ఖాళీ చేయాలనిపిస్తుంది
మంచంపై బట్టల మడతలను
చిందరవందర చేస్తూ కుప్పగా పోస్తాను..
చదివిన పుస్తకాలను చదవని పుస్తకాలను
సరి చేయడానికి వీలు లేకుండా
చిందరవందరగా వేస్తాను...
తప్పిపోవాలనుకుంటాను... తప్పుకు పోవాలనుకుంటాను
మళ్లీ నేనెప్పటికీ ఆ చోటికి రాకుండా
ఆచూకీ మరిచే మరుపు కావాలనుకుంటా...
క్షణాల్లో ఎన్ని యుద్ధాలో మదినిండుగా
ఓయ్
ఈ వైపున అడుగైనా కదపక
నాపై సారించిన నిశ్శబ్దపు చూపు
కట్టిపడేస్తుంది కదలనివ్వక మెదలనివ్వక
కాస్త తప్పుకోవోయ్
నా దారిన నన్ను వెళ్ళనివ్వు...
విసుగు ద్వేషం నేర్పించే
కొత్త ప్రేమపాఠం నేర్చుకోనివ్వు....”!!
*ఆర్.రమాదేవి..!!
మంత్రం కావలసిన ప్రేమ యాంత్రికమైతే మనసు చివుక్కుమంటుంది.
పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎందుకో తెలీదుకానీ,ఒక్కసారిగా విసుగు వస్తుంది
కారణం లేకుండగానే ద్వేషం వస్తుంది.మనసు అదుపుతప్పుతుంది. అసలేం
జరుగుతోందో ఓ పట్టాన…అంతుపట్టదు.
ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి ఇది…
ఇంట్లోవార్డ్రోబ్ ఒక్కసారిగా ఖాళీ చేయాలనిపిస్తోందట..
మంచంపై బట్టల మడతలను చిందరవందర చేస్తూ కుప్పగా పోస్తోంది..
చదివిన పుస్తకాలను చదవని పుస్తకాలను సరి చేయడానికి వీలు లేకుండా
ఎక్కడపడితే అక్కడ చిందరవందరగా వేస్తోంది…
తప్పిపోవాలనుకుంటుంది..తప్పుకుపోవాలనుకుంటుంది. మళ్లీ
తానెప్పటికీ ఆ చోటికి రాకుండా…ఆచూకీ మరిచే మరుపు కావాలనుకుంటోంది..
క్షణాల్లో ఎన్ని యుద్ధాలో ఆమె మదిలో…?
“ఓయ్ !
ఈ వైపున అడుగైనా కదపక నాపై సారించిన నిశ్శబ్దపు చూపు
కట్టిపడేస్తుంది కదలనివ్వక మెదలనివ్వక
కాస్త తప్పుకోవోయ్!
నా దారిన నన్ను వెళ్ళనివ్వు...
విసుగు ద్వేషం నేర్పించే కొత్త ప్రేమపాఠం నేర్చుకోనివ్వని
అతగాడిని నుద్దేశించి చెబుతోంది..!!
ఈ ప్రేమ కూడా చిత్రమైనది. చెదిరిపోతే ఓ చోట కుదురుగా కూర్చోనివ్వదు..
ఒంటరితనం శిలువపై వేలాడుతున్నట్టనిపిస్తుంది.గందరగోళంగా తయారైన
మనసు ఆలోచనను చంపేస్తుంది.ఏంచేయడానికైనా, ఎందాకైనా వెళ్ళాలనిపిస్తుంది.
నియంత్రణ తప్పిన మనసు మాట వినక,అదుపులోకి రాక ఆమె పడుతున్న బాధకు,
అనిశ్చితికి ఈ కవిత ఓ ఉదాహరణ.
*ఎ.రజాహుస్సేన్..!!